Bhakthi Rasaayanamu        Chapters   Last Page

అనుబంధము

రసనిష్పత్తికి స్థాయిభావములు, సంచారిభావములు, అనుభావములు, విభావములు అవసరములని సంప్రదాయ వచనము. స్థాయిభావమే ఇతర భావ సంయోగవశమున రసముగా నిష్పన్నమగును.

నిర్వేదము మొదలుగా గల సంచారి భావములు ముప్పది మూడు గలవని భరతుని వచనము. వీటిని ఆంగ్లమున 'ఇమోషన్స్‌' అందురు. ఏదో ఒక సన్నివేశము నాశ్రయించు కొనిసంచారిభావముద్దీపితమగును. స్థాయిభావమునదాగియున్న సంచారిభావము ప్రత్యక్షదర్శనవలనగాని, భావములవలనగాని, శారీరక పరిణామములవలనగాని రగుల్కొలునబడును. ఇందు ఇచ్ఛా,జ్ఞాన, ఆనందములు సంవలితములై యుండుటచేసంచారి భావోద్దీపనమున వస్తువుయొక్క ప్రధానస్వభావము నిరూపిత మగును. జ్ఞానజన్యమై, ప్రవృత్తిచోదకమై, ఉద్దిష్టార్థప్రాప్తి నాశించునది సంచారిభావము. ఇది క్షణికము, తత్కాలానుభవయోగ్యము నగుటచే స్థాయిభావమున కంగ మగుచున్నది.

సంచారిభావ మనుభవింపబడునపుడు, ఆంతరంగికమగు అనుభూతి బాహ్యముగా వ్యక్తమగును. ఈ వ్యక్తీకరణలో బయలు దేరునని సాత్త్వికభావములు, అనుభావములు. శరీరజములగు కటాక్షాదికమువలె కార్యభూతమైనది అనుభావము (sensation). ఈ యనుభావము లంతర్గతభావమును అనుసరించి యుండునవి. మనోవృత్తు లుద్దీప్తములై ప్రవృత్తిపరము లైనపుడు శరీరమున కన్పించు మార్పులను అనుభావములందురు. అనుభావతుల్యములైనవి సాత్త్వికభావములు. సంచారిభావము నుద్దీపింప జేయగల శక్తి బాహ్యవస్తువున గలదు. ఇట్టి ఉద్దీపన మానసికముగా జరుగుచున్నను శారీరకముగా అభివ్యక్తమగుచున్నది. సాత్త్వికభావానుగతమగు సంచారి భావము సుఖదుఃఖాది హేతుకమగుచు స్థాయిభావమును ప్రవృత్తివరము చేయుచున్నది. సంచారిభావ ముద్దీపితము కాగా తదభివ్యక్తికి తోడ్పడు శారీరక పరిణామములే సాత్త్వికాద్యనుభావములు.

వాచిక, ఆంగిక, సాత్త్వికాభినయము వేటిద్వారావిభావ్యమాన మగుచున్నదో, అవి విభావములు. స్థాయిభావమును రసముగా పరిణమింప జేయుటకు సహకారి కారణములగు విభావములు బాహ్యజగత్తులోని విషయములు లేక సన్నివేశములు.

మనస్సు యొక్క స్వరూపవిన్యాసమున స్థావరముగా నుండునవి స్థాయిభావములు. ప్రతి స్థాయిభావములలోను జ్ఞానాంశ, ప్రవృత్త్యంశ, అను రెండు అంశలు కలవు. ప్రతి వ్యక్తి ఉపయోగించగల మానశికశక్తి స్థాయిభావప్రవృత్తిలో కన్పించును. బాహ్యవిషయ సందర్శనచే స్థాయిభావములో యత్కించిత్‌ చలనము కల్గినతర్వాతనే ప్రవృత్తి ఉత్పన్నమగును. ఈకదలిక రాగానే స్తబ్ధముగానున్న స్థాయిభావముపైకి ఉబుకుచున్నట్లు కన్పించుచే ప్రతి స్థాయిభావమున (Inssinct)విశిష్టమగు సంచారిభావము (Emotion) ఒకటి ఉండును. అన్ని పదార్థములను ఉప్పు తనలోనికి పరిణమింప జేయునట్లు, సంచార్యాభావములను తనలోనికి పరిణమింప జేయ జాలినది స్థాయిభావము. సంచారిభావములు స్థాయికి విరుద్ధములైనను, అవిరుద్ధములైనను, స్థాయిని తిరోగమింప జేయలేవు. ఈ స్థాయిభావమే రసముగా పరిణమించునది.

ప్రధానస్థాయిభావములు రతి, హాసము, క్రోధము, భయము, ఉత్సాహము, విస్మయము అనునవి. గ్లాని, ఔత్సుక్యము, శంక, అసూయ, గర్వము, నిర్వేదము, వ్రీడ, చింత, అనునవి మాత్రమే సంచారిభావములు. స్తంభము, స్వేదము, రోమాంచము, స్వరభంగము, లేపధువు, వైవర్ణ్యము, అశ్రువు, ప్రలయము మొదలగునవి. సాత్త్వికాద్యనుభావములు.*

____________________________________________________________

* ఈ భావములపై సమగ్రవిచారణను భారతిలో, ఖరసంవత్సర పుష్య, ఫాల్గున సంచికలలోను, నందన చైత్రసంచికలోను, సమగ్రముగా వివరించి యున్నాను.

Bhakthi Rasaayanamu        Chapters   Last Page